
5 Comedians Who Will Be Remembered Forever By Telugu Audience
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని 5 కమెడియన్లు
5 Best Telugu Comedians Who Will Be Remembered
నవ్వడం ఒక భోగం… నవ్వించడం ఒక యోగం… నవ్వకపోవడం ఒక రోగం అని ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల చెప్పింది అక్షరాల సత్యం. తమ సినిమాల్లో మంచి కామెడీ పండించి ప్రేక్షకులను బాగా నవ్వించాలని ఫిల్మ్ మేకర్లు ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఎందుకంటే, ప్రేక్షకుల పట్ల కామెడీ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో వారికి బాగా తెలుసు కాబట్టి. అయితే, హాస్యాన్ని పండించగలగడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే… హాస్యాన్ని అందరూ పండించలేరు కాబట్టి.
1. కొండవలస లక్ష్మణరావు:
‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో ‘అయితే ఒకే’ అన్న డైలాగ్ తో బాగా ఫేమస్ అయిపోయారు కొండవలస లక్ష్మణరావు. ఈయన్ని అభిమానులు ఇష్టంగా కొండవలస అనే పిలుచుకుంటారు. మొదట కొండవలస స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చేవారు. వెయ్యికి పైగానే స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఒకసారి ఈ నటుడు దర్శకుడు వంశీ కంటపడ్డారు. అలా కొండవలసకు ‘అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. టాలీవుడ్ లో అడుగుపెట్టిన తరువాత… చేతినిండా సినిమాలతో కెరీర్ ని కొనసాగించారు కొండవలస. 65కిపైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా నవ్వించారు. అనారోగ్య కారణంగా 2015న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
2. ఎం.ఎస్. నారాయణ:
తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మరొక స్టార్ కమెడియన్ ఎం.ఎస్. నారాయణ. పాత్ర ఏదైనా సరే ఆ పాత్రని ఎం.ఎస్. నారాయణ పోషించారంటే ఇక ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు. దొంగ, ప్రిన్సిపాల్, ఇంటి యజమాని, టీ షాప్ ఓనర్, డాక్టర్ వంటి ఎన్నో పాత్రలతో తనదైన శైలిలో నవ్వించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎం.ఎస్.నారాయణ. ‘మా నాన్నకు పెళ్లి’, ‘సర్దుకుపోదాం రండి’, ‘శివమణి’, ‘దూకుడు’ తదితర సినిమాలకు బెస్ట్ మేల్ కమెడియన్ గా నంది పురస్కారాలను అందుకున్నారు ఎం.ఎస్.నారాయణ. జనవరి 23, 2015న ఎం.ఎస్. నారాయణ ఆర్గన్ ఫెయిల్యూర్ తో హైదరాబాద్ లో కన్నుమూశారు.
3. బండ జ్యోతి:
తెలుగు సినిమా ప్రపంచంలో హాస్యాన్ని పండించగల తన సామర్ధ్యంతో పెద్ద హిట్టయిన మహిళా కమెడియన్స్ లో బండ జ్యోతి ఒకరు. ఎం.ఎస్. నారాయణ, ఏవీఎస్ వంటి ప్రసిద్ధ హాస్యనటులతో జ్యోతి నటించారు. ఈవిడ అసలు పేరు జ్యోతి పట్నాయక్. లావుగా ఉన్న కారణంగా ‘బండ’ జ్యోతిగా సినిమాల ద్వారా పాపులర్ అయ్యారు. ‘భద్రాచలం’, ‘గణేష్’, ‘కల్యాణ రాముడు’, ‘స్వయంవరం’ వంటి అనేక సినిమాలలో నటించారు. బండ జ్యోతి హార్ట్ ఎటాక్ తో 2016వ సంవత్సరంలో చనిపోయారు.
4. తెలంగాణ శకుంతల:
పాత్రలకు తగట్టు తెలంగాణ, రాయలసీమ యాసలతో మాట్లాడి ఆ పాత్రలకు ప్రాణం పోసిన నటి తెలంగాణ శకుంతల. ‘మా భూమి’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యారు తెలంగాణ శకుంతల. ఏ హాస్య నటులైనా కేవలం హాస్య పాత్రలకు మాత్రం పరిమితమవుతారు. అయితే, తెలంగాణ శకుంతల మాత్రం ఒకపక్క కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్విస్తూనే మరో పక్క ప్రతికూల పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టగలిగారు. ప్రతికూల పాత్రలతో కూడా ప్రేక్షకులకు చేరువవగలిగారు. 2014 జూన్ 14న కార్డియాక్ అరెస్ట్ తో ఈవిడ కన్నుమూశారు.
5. టి.వి. రమణారెడ్డి:
తెలుగు సినిమా స్వర్ణయుగంలో తన కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో, డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేసిన కమెడియన్ రమణారెడ్డి. పాత్రలలో జీవించి ప్రేక్షకులకు నవ్వు తెప్పించగల రమణారెడ్డి టాలీవుడ్ ఫేవరెట్ కమెడియన్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ‘రోజులు మారాయి’, ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’ సినిమాల్లో రమణారెడ్డి పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తిండిపోయే కొన్ని పాత్రలు. రమణారెడ్డి మరొక హాస్యనటుడైన రేలంగి వెంకట్రామయ్య కాంబినేషన్ టాలీవుడ్ స్వర్ణ యుగంలో ఒక పెద్ద హిట్. రమణారెడ్డి బౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ పోషించిన పాత్రలతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు అన్నది అక్షర సత్యం.
Also Read : Tollywood Celebrities Who Entered Into Politics