
Tollywood Actress Who Paired With Tamil Super Star Rajini Kanth
తమిళ సూపర్ స్టార్ తో టీ టౌన్ బ్యూటీస్ జోడీ
సూపర్ స్టార్ రజినీకాంత్… ఈ పేరు వింటేనే చాలు అభిమానులకు ఆయన నటించిన ఎన్నో సినిమాలు గుర్తుకొచ్చేస్తాయి. ఆయన వీరాభిమానులైతే… ‘నా దారి రహదారి’, ‘లక లక లక లక’, ‘ఈ భాషా… ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ వంటి ఎన్నో రజినీకాంత్ డైలాగ్స్ చెప్పేస్తారు. రజినీకాంత్ డైలాగ్స్ యే కాదు ఆయన డాన్స్ కూడా తన అభిమానుల్ని బాగా ఆకర్షించాయి. అందుకే ఇన్నేళ్లయినా ఈ సూపర్ స్టార్ తో జోడీ కట్టాలని, తెరపై ఈ స్టార్ తో ఆడిపాడాలని తహతహలాడని కథానాయికలు ఉండరంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, రజినీకాంత్ తో నటించాలని కోరిక ఉంటే సరిపోదు… ఆ అదృష్టం కూడా వరించాలి. ఆ అదృష్టం దక్కించుకున్నారు కొంతమంది టాలీవుడ్ బ్యూటీస్.
1. శ్రేయ:
తెలుగులో ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ కి ఎంటరయ్యారు శ్రేయ. ఈ సినిమా తరువాత తెలుగునాట అగ్ర హీరోలతో నటించి టాలీవుడ్ లో కెరీర్ పరంగా దూసుకుపోయిన శ్రేయా… తమిళనాట సూపర్ స్టార్ రజినికాంత్ తో కూడా నటించారు. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ కు జోడీగా ‘శివాజీ’ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు శ్రేయ. మొదట ఈ సినిమాలోని హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ ని సెలెక్ట్ చేశారు. అయితే ఆ తరువాత శ్రేయ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారని శంకర్, రజినీకాంత్ అనౌన్స్ చేశారు. అలా రజినీకాంత్ సినిమాలో అవకాశాన్ని కొట్టేశారు శ్రేయ. ఈ సినిమాలో ఎంతో సంప్రదాయమైన చీరకట్టులో, పరికిణీ ఓణీలో కనిపిస్తారు. పాటలకు తగ్గ కాస్ట్యూమ్స్ తో అలరించారు శ్రేయ.
2. సౌందర్య:
సౌందర్య… తన నటనతో కొన్ని సంవత్సరాలు తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి. సౌందర్య కూడా రజినీకాంత్ తో నటించారు. సౌందర్య రజినీకాంత్ తో ‘అరుణాచలం’, ‘నరసింహ’ సినిమాలలో నటించారు. ‘అరుణాచలం’లో సౌందర్య పాత్ర పేరు వేదవల్లి. ‘నరసింహ’లో సౌందర్య పోషించిన పాత్ర పేరు ‘వసుంధర’. ఈ సినిమాలోనూ రజినీకాంత్, సౌందర్య జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంది. ఈ రెండు సినిమాలలో అమాయకమైన పాత్రల్లో కనిపించారు సౌందర్య.
3. మీనా:
‘నవయుగం’ సినిమాలో రాజేంద్రప్రసాద్ కు జోడీగా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు మీనా. అయితే, మీనా తెలుగు సినిమా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా. ఇందులో నాగేశ్వరరావు మానవరాలుగా నటించారు మీనా. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానం కలిగించుకొన్న మీనా రజినీకాంత్ తో ‘ముత్తు’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో మీనా పోషించిన పాత్ర పేరు ‘రంగనాయకి’. ఇందులో మీనా నాటకాలలో నటించే నటిగా నటించారు. మీనా పోషించిన ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా చేరువయింది. ఇందులో ‘తిల్లానా తిల్లానా’ పాటలో రజినీకాంత్, మీనా డాన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. ఈ పాటలో ఈ ఇద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డాన్స్ చేశారు.
4. రంభ:
‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో తన పాత్ర పేరునే తన ఆన్ స్క్రీన్ నేమ్ గా మార్చుకొన్న నటి ‘రంభ’. మన తెలుగు అమ్మాయి రంభ అసలు పేరు విజయలక్ష్మి. రంభ కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు జోడీగా నటించారు. ‘అరుణాచలం’ సినిమాలో రంభ పోషించిన పాత్ర పేరు ‘నందిని’. రజినీకాంత్ కి అసిస్టెంట్ గా రంభ నటించారు ఇందులో. అనుకోకుండా రజినీకాంత్ పాత్రతో ప్రేమలో పడుతుంది రంభ పోషించిన పాత్ర. రంభ, రజినీకాంత్ తో కలిసి ఇందులో ఓ పాటలో ఆడిపాడారు కూడా. చిన్నపాత్ర అయినప్పటికీ రజినీకాంత్ నటనకు సరిపోయే విధంగా రంభ నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు.
5. అనుష్కశెట్టి:
అనుష్క టాలీవుడ్ లోనే అగ్ర హీరోలతో జోడీ కట్టారని అనుకుంటే పొరపాటే. స్వీటీ అనుష్కా… రజినీకాంత్ తో కూడా నటించారు. రజినీకాంత్, అనుష్క కలిసి నటించిన సినిమా ‘లింగ’. తెలుగులో కూడా ఇదే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇందులో అనుష్కశెట్టి పోషించిన పాత్ర పేరు ‘లక్ష్మి’. అనుష్క పొడగరి అన్న విషయం తెలిసిందే. దాంతో, రజినీకాంత్ కి అనుష్క కరెక్ట్ గా జోడీ కుదిరిందని ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు ప్రశంసల ఝల్లు కురిపించారు.
6. రమ్యకృష్ణ:
రజినీకాంత్ తో జోడీ కట్టిన టాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో ఖచ్చితంగా చెప్పాల్సిన పేరు రమ్యకృష్ణ. ఎందుకంటే ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ పాత్రే రజినీకాంత్ పాత్రకు ధీటుగా ఉంటుంది. మన తెలుగులో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏకంగా 24 సినిమాలలో నటించిన అసలు సిసలైన టాలీవుడ్ హీరోయిన్ అని అనిపించుకున్న రమ్యకృష్ణ…. ‘నరసింహ’ చిత్రంలో రజినీకాంత్ పాత్రకు సవాల్ విసిరే పాత్రలో నటించారు. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన ‘నీలాంబరి’ పాత్ర రజినీకాంత్ పోషించిన పాత్రతో సమానంగా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. తరువాత ‘బాబా’ సినిమాలో ఓ సన్నివేశంలో రమ్యకృష్ణ ‘నీలాంబరి’గానే కనిపించిన విషయం తెలిసిందే. వాస్తవానికి 1985లోనే రమ్యకృష్ణ, రజినీకాంత్ కలిసి ఓ తమిళ సినిమాలో నటించారు. అయితే, ‘నరసింహ’ సినిమా మాత్రం వీళ్లిద్దరికీ బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది.