
Unknown Facts About King Nagarjuna
నాగ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Unknown Facts About Nagarjuna
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ అందగాడు, గ్రీకువీరుడు, నవ మన్మధుడు. ఎప్పటికీ ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ సినిమాల్లో హీరోలుగా పరిచయమయినా… ఇప్పటికీ నాగార్జున సినిమాలలో నటిస్తున్నారంటే ఆ ప్రాజెక్టులపై అభిమానుల్లో క్రేజు ఏర్పడడం విశేషం. సినిమాల్లోనే కాదు బయట కూడా ఎంతో కూల్ గా కనిపిస్తారు నాగ్.
1. చదువు:
నాగార్జున మద్రాస్ లోని ఆగష్టు 29న జన్మించారు. నాగార్జున తండ్రి ప్రముఖ నటులు నాగేశ్వరరావు అన్న విషయం తెలిసిందే. నాగ్ తల్లి పేరు అన్నపూర్ణ. కొన్నాళ్లకి వీరి కుటుంబం హైదరాబాద్ కి వచ్చేసింది. నాగ్ హైదరాబాద్ లోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లలో చదువుకున్నారు. ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు.
2. బ్రదర్స్ అండ్ సిస్టర్స్:
నాగార్జునకు ఒక బ్రదర్, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. నాగార్జున సోదరుడి పేరు వెంకట్ అక్కినేని. సిస్టర్స్ పేర్లు.. సరోజ, సత్యవతి, నాగ సుశీల. నాగార్జున తన చదువు పూర్తైన తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు.
3. చిన్నతనంలోనే:
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెలుగు నీడలు’ సినిమాలో ఓ శిశువు పాత్రలో కనిపించారు నాగార్జున. ఇందులో నాగార్జున పోషించిన పాత్ర పేరు రఘు. ఆ తరువాత మళ్ళీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోనే వచ్చిన ‘సుడిగుండాలు’ సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ రెండు సినిమాల్లోనూ నాగేశ్వరరావే హీరోగా నటించారు.
4. మొదటి సినిమా:
నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్’ అన్న విషయం తెలిసిందే. మధుసూదన రావు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించారు. 1986లో వచ్చిన ఈ సినిమా 1983 నాటి హిందీ సినిమా ‘హీరో’కు రీమేక్. ‘విక్రమ్’ సినిమా విజయవంతమయ్యి నాగార్జునకు కెరీర్ పరంగా ఓ గుడ్ స్టార్ట్ ఇచ్చింది.
5. ట్రెండ్ సెట్టర్ ‘శివ’:
‘విక్రమ్’ తరువాత… ‘శివ’ ముందు నాగార్జున అనేక సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘మజ్ను’, కొత్త దర్శకుడు గీతాకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘సంకీర్తన’, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆఖరి పోరాటం’, ‘జానకి రాముడు’, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’. ఈ సినిమాలు విజయాలు అందుకొని నాగార్జునకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. వీటి తరువాత వచ్చిన సినిమా ‘శివ’ తెలుగు సినిమా ప్రపంచంలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ లో నాగార్జునను స్టార్ హీరోగా మార్చింది. ఆ తరువాత ‘జైత్ర యాత్ర’, ‘నిర్ణయం’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు నాగ్.
6. బుల్లితెరపై:
వెండితెరపై ఎంతో విజయం సాధించిన నాగార్జున బుల్లితెరపైనా తన హవా చూపించారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు. ‘బిగ్ బాస్’ హోస్ట్ గా హౌస్ మేట్స్ తో పాటు మనల్నీ ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ 5కి మళ్ళీ ఆయనే హోస్ట్ గా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
7. ఆఫ్ స్క్రీన్ జీవితం:
వెండితెరపై, బుల్లితెరపై నాగార్జున చేసిన సినిమాలు, షోలు మనకు తెలిసిందే. నాగార్జున యొక్క ఆఫ్ స్క్రీన్ వర్క్ ఏమిటో తెలుసుకోవాలని చాలామంది తహతహలాడుతూ ఉంటారు. 2009లో ‘యువ’ అనే సీరియల్ తో టెలివిజన్ ప్రొడ్యూసర్ అవతారమెత్తారు నాగ్. మాటీవీ ‘స్టార్ మా’గా మారకముందు ఆ ఛానల్ లో మేజర్ షేర్ హోల్డర్స్ లో నాగార్జున ఒకరిగా ఉండేవారు. తన అన్నపూర్ణా స్టూడియోస్ వ్యాపారాన్ని కూడా తన సోదరుడితో చూసుకుంటారు నాగ్. ఎన్3 రియాలిటీ ఎంటర్ ప్రయిజెస్ కు నాగార్జున ఓ ఫౌండింగ్ పార్టర్ గా ఉన్నారు.
8. వివాహం:
దగ్గుబాటి లక్ష్మితో విడిపోయిన తరువాత… నాగార్జున, అమల వివాహం 1992లో జరిగింది. వీరి కుమారుడు హీరో అఖిల్. నాగార్జున, అమల ‘కిరాయి దాదా’, ‘చినబాబు’, ‘శివ’, ‘ప్రేమ యుద్ధం’, ‘నిర్ణయం’ సినిమాల్లో కలిసి నటించారు. ‘మనం’ సినిమాలో డాన్స్ టీచర్ గా ఓ అతిథి పాత్రలో కనిపించారు అమల. టాలీవుడ్ లో సూపర్ జోడి అంటే నాగార్జున, అమల అని అందరూ అంటారు.